సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ కొత్త ఎత్తుగడలతో అమాయకులను నిలువునా దోచుకుంటున్నారు. తాజాగా బోడుప్పల్‌కు చెందిన ఓ ఐటీ ఉద్యోగిని వాటర్ బిల్లు పేరుతో బురిడీ కొట్టించి, అతని ఖాతా నుంచి రూ.1.27 లక్షలు దోచుకున్నారు.
బోడుప్పల్ నివాసి, ఐటీ ఉద్యోగి అయిన సాయి కుమార్‌కు సైబర్ కేటుగాళ్లు ఫోన్ చేశారు. తాము మెట్రో వాటర్ వర్క్స్ అధికారులమని నమ్మబలికారు. వాటర్ బిల్లు అప్‌డేట్ చేయాలని, లేదంటే కనెక్షన్ కట్ అవుతుందని భయపెట్టారు. అప్‌డేట్ కోసం ఒక లింక్ పంపి, అందులో క్రెడిట్ కార్డ్ వివరాలు నమోదు చేయాలని సూచించారు.
బాధితుడు ఆ లింక్ క్లిక్ చేయగానే, అతని ఫోన్‌లోకి తెలియకుండానే ఒక మాల్వేర్ ప్రవేశించింది. ఈ మాల్వేర్ వల్ల సాయి కుమార్ ఫోన్‌కు వచ్చే ఓటీపీ (OTP) సందేశాలు అతనికి కనిపించకుండా హ్యాకర్ల నియంత్రణలోకి వెళ్లాయి. బాధితుడికి తెలియకుండానే అమెజాన్ పే, బిగ్ బాస్కెట్ వంటి యాప్స్ ద్వారా వరుసగా ఆరు లావాదేవీలు జరిపి రూ.1లక్షా27వేల430 కాజేశారు.
చివరికి తన ఖాతాలో నగదు డెబిట్ అయినట్లు గుర్తించిన సాయి కుమార్, మోసపోయానని గ్రహించి మేడిపల్లి పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
